శ్రీ చక్ర పెరుమాళ్ల స్వామి ఆలయ చరిత్ర
శ్రీకాకుళం(#srikakulam) జిల్లా కవిటి(#Kaviti) మండలం బెజ్జిపుట్టుగ(#bejjiputtuga) గ్రామం లో కొలువై ఉన్న శ్రీ చక్ర పెరుమాళ్ళ(#chakraperumalla swamy) డోలోత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి. 14 రోజులు వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.
సుమారు మూడు శతాబ్దాల కిందట బ్రిటిష్వారి పాలనలో తూర్పు తీరమైన బంగాళాఖాతంలో డచ్వారు ప్రయాణించే నౌక బెజ్జిపుట్టుగ గ్రామ సమీపంలో హఠాత్తుగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బెజ్జిపుట్టుగ గ్రామస్థులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నౌకలో శ్రీదేవి, భూదేవి సమేత చక్రధర స్వామివారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను బయటకు తీసి గ్రామంలోని ఓ పురిపాకలో కళింగ వైష్ణవులు ప్రతిష్ఠించారు.అనంతరం నౌక ముందుకు కదిలినట్టు స్థానికులు చెబుతుంటారు. అలా వెలసిన స్వామివారిని బెజ్జిపుట్టుగకు చెందిన ఈనాందారులైన ఇచ్ఛాపురం వాసి గాదె దంపతులు తన స్వగృహానికి తీసుకువెళ్ళి వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తుండగా ఇల్లంతా రక్తవర్ణం, వారు తిన్న తిండి కూడా రక్త వర్ణంగా మారిపోయింది. దాంతో భయబ్రాంతులైన పంతుళ్ళు మేము స్వామివారిని భోగరాగాలు నిర్వహించలేమని మరల బెజ్జిపుట్టుగలోనే విడిచివెళ్లారు. రాతితో ఆలయ నిర్మాణం స్వామివారిని వంశపారంపర్య ధర్మకర్తలైన దివంగత రాజయోగి పొందల రామస్వామి నాయుడు ఈ విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేశారు. అనంతరం ఆయన కుమారులు కృష్ణమనాయుడు ఆలయ నిర్మాణం చేసి విగ్రహాల ప్రతిష్ఠ జరిపించారు. వివిధ శిల్పాలు రాతిపై చెక్కించి గర్భగుడి నుంచి గరుడ స్తంభం వరకు ఆలయ నిర్మాణం చేశారు. అనంతరం ఆలయ ముందు భాగం మండపాన్ని దివంగత మాదిన సింహాద్రి ఆధ్వర్యంలో 1955లో నిర్మాణం పూర్తి చేసుకొని చక్రపెరుమాళ్ స్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా వెలసింది. అప్పటి నుంచి ఏటా స్వామివారి డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆలయంలో రాతి విగ్రహాలను ప్రతిష్టించి,ధ్వజ స్థంభం ఏర్పాటు చేసారు. 14 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్న ఈ ఉత్సవాల్లో ఆంధ్రా, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు.